manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 6:21 am Editor : manabharath

ఆ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి..!

పాత 2005 చట్టాన్ని పునరుద్ధరించి అమలు చేయాలి

– సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న

తాంసి మండలంలో ఉపాధి కూలీల నిరసన

మన భారత్, తాంసి :
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ కొత్త పథకం–2026ను వెంటనే రద్దు చేసి, పాత ఉపాధి హామీ చట్టం–2005ను పునరుద్ధరించి అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తాంసి మండలంలోని ఈదుల్ల సార్గాం, బండల్ నాగపూర్ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల సమస్యల పరిష్కారం కోసం గురువారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశాలను సందర్శించిన నాయకులు కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన నిరసన కార్యక్రమంలో బొజ్జ ఆశన్న మాట్లాడుతూ, 2005లో తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం గ్రామీణ కూలీలు, రైతులు, నిరుద్యోగులకు ఎంతో మేలు చేసిందన్నారు. గ్రామాభివృద్ధి, ఉపాధి కల్పన, రైతుల భూముల అభివృద్ధి, చెరువుల పునరుద్ధరణ, కాలువల నిర్మాణం, పశువుల కోసం నీటి వనరుల సృష్టి వంటి అనేక పనులు ఆ చట్టం ద్వారా జరిగాయని గుర్తు చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త ఉపాధి హామీ పథకం–2026లో గతంలో ఉన్న అనేక సౌకర్యాలను తొలగించిందని ఆరోపించారు. ఉపాధి కూలీలకు ఇచ్చే గుల్లలు, పారలు, గడ్డపారలు, మంచినీటి సదుపాయం, టెంట్లు, మెడికల్ కిట్లు, వారపు పే స్లిప్పులు, 20 రోజులలోపు కూలీ చెల్లింపులు వంటి సౌకర్యాలు ఇప్పుడు లేకుండా పోయాయని తెలిపారు.

కొత్త పథకంలో రోజుకు రెండుసార్లు ఫోటోలు తీసే విధానం, పనుల జాబితా తగ్గింపు, నిధుల కేటాయింపుల కోతలతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని ఒకేసారి రద్దు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం “స్లో పాయిజన్” మాదిరిగా క్రమంగా పథకాన్ని బలహీనపరుస్తోందని ఆరోపించారు.

ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి కూలీలు, రైతులు, ప్రజలందరూ ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

కూలీల ప్రధాన డిమాండ్లు ఇవే

  • కొత్త ఉపాధి హామీ పథకం–2026ను రద్దు చేసి పాత 2005 చట్టాన్ని అమలు చేయాలి
  • కూలీ డబ్బులను 15 రోజుల్లోపు చెల్లించాలి
  • వారపు పే స్లిప్పులు అందించాలి
  • వేసవి బోనస్‌తో పాటు గుల్లలు, పారలు, గడ్డపారలు ఇవ్వాలి
  • పని ప్రదేశాల్లో మెడికల్ కిట్లు, మంచినీళ్లు, టెంట్లు ఏర్పాటు చేయాలి
  • 20 మంది కూలీలకు ఒక మేట్‌ను నియమించాలి
  • రోజుకు రెండుసార్లు ఫోటోలు తీసే విధానాన్ని రద్దు చేయాలి
  • వికలాంగులకు తగిన పనులే ఇవ్వాలి
  • ప్రతి కూలీ కుటుంబానికి 125 రోజుల పని కల్పించాలి
  • ప్రభుత్వం నిర్ణయించిన రూ.307 కూలీని కచ్చితంగా చెల్లించాలి
  • వడదెబ్బ తగిలిన కూలీలకు వైద్య ఖర్చులు భరించాలి

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే ఆశన్నతో పాటు బుచ్చన్న, నాగమ్మ, అజయ్, రమేష్, స్వామి, ఉషన్న, సవిత తదితర కూలీలు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..