manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 2:45 am Editor : manabharath

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం..

రైతులకు నాణ్యమైన విత్తనాల అందుబాటుకు టాస్క్ ఫోర్స్ తనిఖీలు

చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు

– ఏవో పి సురేందర్ రెడ్డి, ఎస్ఐ ముప్పు సురేష్

మన భారత్, మొగుళ్లపల్లి :
రాబోయే వర్షాకాలం 2026 వ్యవసాయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు మండల టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు, అనధికారిక విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారి పి సురేందర్ రెడ్డి మరియు ఎస్ఐ ముప్పు సురేష్ వెల్లడించారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయ దుకాణాల్లో గురువారం అకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ రైతులను మోసం చేసే నకిలీ విత్తనాల ముఠాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు.

వచ్చే ఖరీఫ్ సీజన్‌లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసు శాఖ అధికారులు కలిసి తనిఖీలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

తనిఖీల్లో భాగంగా పత్తి విత్తనాల లభ్యత, నిల్వలు, ఎరువుల నిల్వలు, పురుగుమందుల స్టాక్ వివరాలు, లైసెన్స్ పత్రాలు, కొనుగోలు రసీదులు, అమ్మకపు బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు, ధరల పట్టికలు తదితర అంశాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు.

ప్రతి విత్తన, ఎరువులు, పురుగుమందుల డీలర్ చట్టాలకు లోబడి వ్యాపారం నిర్వహించాలని హెచ్చరించారు. డీలర్లు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగి ఉండాలని, అది అందరికీ కనిపించే విధంగా షాపు ముందు ప్రదర్శించాలని సూచించారు. అలాగే స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్స్‌పై వ్యవసాయ అధికారులతో ధృవీకరణ చేయించుకోవాలని తెలిపారు.

రైతులు కొనుగోలు చేసిన ప్రతి సరుకుకు తప్పనిసరిగా బిల్లు లేదా రశీదు ఇవ్వాలని, ఆ బిల్లుపై డీలర్ లైసెన్స్ నెంబర్ స్పష్టంగా ఉండాలని పేర్కొన్నారు. రోజువారీ నిల్వల వివరాలను స్టాక్ బోర్డుపై నమోదు చేసి ప్రజలకు కనిపించేలా ఉంచాలని సూచించారు.

ఎక్కువ ధరలకు అమ్మకం, బ్లాక్ మార్కెటింగ్, నకిలీ విత్తనాల విక్రయం వంటి అక్రమాలకు పాల్పడితే లైసెన్స్ రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్స్‌లో పేర్కొన్న గోదాముల్లో మాత్రమే సరుకులను నిల్వ చేయాలని, అనధికారిక నిల్వలు కనుగొనబడితే సరుకులను స్వాధీనం చేసుకుని సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.

డీలర్లు సరుకులను కేవలం ప్యాకెట్ల రూపంలో మాత్రమే విక్రయించాలని, లూజ్‌గా అమ్మకాలు జరపకూడదని తెలిపారు. లైసెన్స్‌లో పేర్కొన్న చిరునామాలోనే నిల్వలు, అమ్మకాలు నిర్వహించాలని సూచించారు.

రైతులను నకిలీ విత్తనాల బారిన పడకుండా కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని, వ్యవసాయ రంగంలో పారదర్శకత కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు. రైతులు కూడా విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, అనుమానాస్పద విత్తనాలపై వెంటనే వ్యవసాయ శాఖకు సమాచారం అందించాలని కోరారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..