మన భారత్, తలమడుగు:
హామీలు నెరవేర్చాలని ప్రభుత్వానికి డిమాండ్.. పోలీస్ స్టేషన్‌లో సమ్మె నోటీసుల అందజేత
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఇందిరా క్రాంతి పథకం విఓఏలు (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు) తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమ్మెకు సిద్ధమవుతున్నట్లు వారు ప్రకటించారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మంగళవారం తలమడుగు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న విఓఏలు ముందస్తు అనుమతి కోసం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమకు కనీస వేతనంగా నెలకు రూ.20 వేల జీతం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా ఎస్సీఆర్పీ ఉద్యోగులుగా గుర్తించి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
విఓఏలకు ఆరోగ్య భీమా రూ.20 లక్షల వరకు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నో సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేదంటే ఈ నెల 18వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. శాంతియుతంగా సమ్మె నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విఓఏలు రాధిక, గంగన్నతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. పోలీస్ అధికారులు వినతిపత్రాన్ని స్వీకరించారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
