manabharath.com
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 2:06 am Editor : manabharath

కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యత అవసరం

మన భారత్, ధన్వాడ: 

మండల కేంద్రమైన ధన్వాడలో శుక్రవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన రహదారి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంచాయతీ బిల్ కలెక్టర్ బాలకృష్ణ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ మండల అధ్యక్షురాలు రాణి మాట్లాడుతూ, కార్మికుల హక్కుల కోసం జరిగిన చారిత్రక పోరాటాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సీఐటీయూ నాయకులు కే.కాశప్ప మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు.

ప్రస్తుతం అమలులోకి తీసుకువస్తున్న నాలుగు కార్మిక కోడ్లు యజమానులకు అనుకూలంగా ఉండి, కార్మికులను కట్టుబానిసత్వంలోకి నెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత వంటి అంశాలు కార్మికులకు దూరమవుతున్నాయని పేర్కొన్నారు.

మంచి వైద్యం, నాణ్యమైన విద్య వంటి మౌలిక హక్కులు కూడా కార్మికులకు అందని ద్రాక్షగా మారుతున్నాయని అన్నారు. ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలతో జీవించడం కష్టమవుతోందని, శ్రమకు గౌరవం తగ్గిపోతున్నదని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు సావిత్రమ్మ, మాధవి, అనిత, గంగ, ఆయామంగమ్మ, గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు రఘు, మొగులయ్య, లక్ష్మణ్, రాజు, రమేష్, సద్దాం హుస్సేన్, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మండల కార్యదర్శి పెంటయ్య, వేణు, సత్తయ్య, శాంతప్ప, అమాలి యూనియన్ నాయకులు కురుమయ్య, గోపి, బాలరాజు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల సంక్షేమం కోసం ఐక్యంగా పోరాడాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..