manabharath.com
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 4:01 pm Editor : Editor Vishal Kumar

అగ్ని ప్రమాదంలో 16 ఎకరాల పంట దగ్ధం..

మన భారత్, మొగుళ్ళపల్లి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు సంభవించిన అగ్ని ప్రమాదంలో రైతులు కష్టపడి సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. సుమారు 16.20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పంట కాలిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

అప్పులు చేసి పెట్టుబడి పెట్టి, చెమటోడ్చి పండించిన పంట కళ్లముందే బూడిద కావడంతో రైతుల జీవితం దెబ్బతిన్నది. చేతికొచ్చే దిగుబడి కోల్పోవడంతో ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూశామని రైతులు వాపోయారు.

సమాచారం అందుకున్న వెంటనే స్థానిక తహసిల్దార్ జాలీ సునీతా రెడ్డి, ఎస్ఐ ముప్పు సురేష్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నట్లు తెలిపారు.

ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు మరింత వ్యాపించకుండా నిరోధించేందుకు వారు విశేషంగా శ్రమించారు.

ఈ సందర్భంగా తహసిల్దార్ జాలీ సునీతా రెడ్డి మాట్లాడుతూ, రైతులు ధైర్యం కోల్పోవద్దని సూచించారు. ఈ ఘటనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..