manabharath.com
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 10:28 am Editor : manabharath

రైతులకు పరిహారం ఇవ్వాలంటూ ధర్నా..!

మన భారత్, నారాయణపేట: 

ఇటీవల కురిసిన వడగళ్ల వర్షంతో వరి పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గడిమున్కనిపల్లి గ్రామంలో బుధవారం కురిసిన వడగళ్ల వర్షం వల్ల విస్తారంగా వరి పొలాలు నష్టపోయాయి. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, రైతు సంఘాల నాయకులు రైతులతో కలిసి స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.

ముందుగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన నాయకులు, రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ, పంట నష్టాన్ని అంచనా వేసి తక్షణమే పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అకాల వర్షాలు రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయని, ప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టానికి తగిన పరిహారం ఇవ్వకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ధర్నా అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఇందులో పంట నష్టాన్ని గుర్తించి, రైతులకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం మద్దూర్ ఏరియా కార్యదర్శి గోపాల్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య, మాజీ వైస్ ఎంపీపీ మహేష్ కుమార్, హన్మంతు, విజయ్ బాబు, రైతులు పవన్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

రైతుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..