manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 12:11 pm Editor : Editor Vishal Kumar

రైతులకు మౌలిక సదుపాయాలు తప్పనిసరి..

మన భారత్, మొగుళ్లపల్లి:

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమగ్రంగా కల్పించాలని తహసీల్దార్ జాలీ సునీతా రెడ్డి నిర్వాహకులకు సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

మండల వ్యవసాయ శాఖ అధికారి పి. సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వరి కోత హార్వెస్టర్ల యజమానులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులకు పంట కోత మరియు ధాన్యం కొనుగోలు సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథులుగా హాజరైన తహసీల్దార్ జాలీ సునీతా రెడ్డి, ఎస్ఐ ముప్పు సురేష్‌లు మాట్లాడారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు నీడ సౌకర్యం, తాగునీరు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు వంటి సదుపాయాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అధికారులు, నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని కోరారు.

అదేవిధంగా వరి కోత సమయంలో కంబైన్డ్ హార్వెస్టర్ల వినియోగంపై కూడా సూచనలు చేశారు. హార్వెస్టర్ బ్లోయర్ యాక్టివ్‌లో ఉండేలా చూసుకోవాలని, ఆర్పీఎం 18 నుంచి 20 మధ్య ఉండాలని, గ్రౌండ్ స్పీడ్ గేర్ రేషియో B2 నుంచి A1 వరకు ఉండేలా నియంత్రించాలని తెలిపారు. ఈ విధంగా కోతలు చేస్తే తాలు, గడ్డి వంటి మలినాలు లేకుండా నాణ్యమైన వరి ధాన్యం లభిస్తుందని చెప్పారు.

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను కూడా ఈ సందర్భంగా వివరించారు. “A” గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 ధర అందించబడుతుందని తెలిపారు. రైతులు తేమ శాతం 17 లోపు ఉండే నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు, పీఏసీఎస్ ఇన్‌చార్జీలు, హార్వెస్టర్ యజమానులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..