manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 6:59 am Editor : Editor Vishal Kumar

మంచి నీళ్లు ఇవ్వండి మహాప్రభో.!

మన భారత్, సూర్యాపేట:

సూర్యాపేట జిల్లా కేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. భాగ్యనగర్ కాలనీలో గత నెల రోజులుగా తాగడానికి సరిపడా నీరు అందకపోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. తాగునీరు కోసం ఎన్నిసార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను సంప్రదించినా స్పందన లేకపోవడంతో కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ కాలనీ వాసులు ఖాళీ బిందెలతో దంతాలపల్లి రహదారిపైకి వచ్చి నిరసన తెలిపారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ సందర్భంగా మహిళలు, స్థానికులు మాట్లాడుతూ, “ఓట్లు వేయమంటే వచ్చి అడుగుతారు… కానీ ఇప్పుడు నీళ్లు అడిగితే ఎవరూ పట్టించుకోవడం లేదు. నాయకులను ప్రశ్నిస్తే ‘ఫ్రీగా ఓట్లు వేసారా? డబ్బులు తీసుకోలేదా?’ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే పారిశుధ్య సమస్యలు కూడా కాలనీలో తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. కాలువలు శుభ్రం చేయడానికి రూ.50, చెత్త తీసుకెళ్లడానికి రూ.100 వసూలు చేస్తున్నారని, డబ్బులు ఇవ్వకపోతే పని చేయడం లేదని పారిశుధ్య కార్మికులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీటి సమస్యతో పాటు పారిశుధ్య సమస్యలు పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తక్షణమే తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనతో సూర్యాపేట పట్టణంలో నీటి సమస్య మరోసారి వెలుగులోకి వచ్చింది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..