మన భారత్ తలమడుగు (తాంసి):
పెళ్లి సందడి నడుమ విషాదం చోటుచేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో కలకలం రేపింది. కూతురు పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లిన తండ్రి, తిరిగి శవంగా ఇంటికి చేరడంతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.
గ్రామస్తుల వివరాల ప్రకారం గిరిగామకు చెందిన ఆది జ్ఞానేశ్వర్ (43) తన కుమార్తె అశ్విని పెళ్లి మే 4న జరగాల్సి ఉండగా, ఆదివారం బంధువుల ఇంటికి ఆహ్వాన పత్రికలు పంచేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని బోరిగామ సమీపంలో ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యలోనే జ్ఞానేశ్వర్ మృతి చెందినట్లు సమాచారం. అదే ప్రమాదంలో ఆయనతో పాటు ఉన్న అమృత్‌కు కూడా గాయాలు కావడంతో తొలుత రిమ్స్ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలించారు.
మృతుడికి భార్య అనిత, కుమార్తె అశ్విని, కుమారుడు సిద్దు ఉన్నారు. పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమైన కుటుంబానికి ఈ ఘటన తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. ఆనందంగా జరగాల్సిన పెళ్లి వేడుక, ఒక్కసారిగా విషాదంగా మారడంతో గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
