మన భారత్, మొగుళ్ళపల్లి:
అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించే నిజమైన సైనికులని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్‌ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సంక్షేమ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో అంగన్వాడీ కేంద్రాల సేవలు అమోఘమని అభినందించారు. గ్రామస్థాయిలో ప్రతి కుటుంబానికి చేరువగా ఉండి ఆరోగ్య, పోషకాహారంపై అవగాహన కల్పించడంలో వారి పాత్ర కీలకమని తెలిపారు.
ప్రతి శిశువుకు కనీసం ఆరు నెలలపాటు తల్లిపాలు అందేలా చూడాలని, గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకునేలా చైతన్యం కల్పించాలని సూచించారు. అంగన్వాడీ సేవలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను వినియోగిస్తోందని, అందులో భాగంగా స్మార్ట్ ఫోన్‌లను అందజేస్తున్నామని తెలిపారు.
భూపాలపల్లి డివిజన్ పరిధిలోని 418 మంది అంగన్వాడీ సిబ్బందికి స్మార్ట్ ఫోన్‌లను పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టే వివిధ సర్వేల్లో అంగన్వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ప్రతి గర్భిణీ, చిన్నారి వివరాలను సమగ్రంగా నమోదు చేయడం ద్వారా సంక్షేమ పథకాల అమలు మరింత మెరుగుపడుతుందని సూచించారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్‌లను పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులకు ప్రోగ్రెస్ రిపోర్ట్‌లు అందజేశారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ రజితతో పాటు టీచర్లు మోటే రజిత, ఎల్దండి వెన్నెల, బత్తిని స్వప్న, బత్తిని అనిత, తక్కల్లపల్లి అశ్విని, చెవ్వ స్వరూప తదితరులు పాల్గొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
