మన భారత్ ,ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారంతో పాటు కూతురి పెళ్లి బాధ్యతలు మోస్తూ తీవ్ర మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బేల మండలంలోని పాఠన్ గ్రామంలో వెలుగుచూసింది.
గ్రామానికి చెందిన రైతు లస్మారెడ్డి (49) సాగులో సరైన దిగుబడి రాకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మానసికంగా తీవ్రంగా కలత చెందుతున్నాడు. ఇదే సమయంలో వచ్చే నెలలో జరగాల్సిన తన కుమార్తె వివాహం కోసం డబ్బు సమీకరించలేకపోవడం అతనికి మరింత భారంగా మారింది.
ఈ పరిస్థితుల్లో తీవ్ర నిరాశకు లోనైన లస్మారెడ్డి మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, రిమ్స్‌కు తీసుకెళ్లేలోపే మృతి చెందినట్లు సమాచారం.
మృతుడి భార్య వెంకటమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి.
రైతులపై పెరుగుతున్న అప్పుల భారం, వ్యవసాయంలో అనిశ్చిత పరిస్థితులు మరో ప్రాణాన్ని బలితీసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు కోరుతున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
