manabharath.com
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 2:13 am Editor : manabharath

ఆర్టీసీ సమ్మె ప్రభావం.. ప్రయాణికుల ఇబ్బందులు

 

మన భారత్, హైదరాబాద్ : 
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టడంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. సమ్మె ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమవగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచే బస్టాండ్‌ల వద్ద ప్రయాణికులు పడిగాపులు కాచడం కనిపించింది.

హైదరాబాద్ నగరంలోని ప్రధాన బస్టాండ్‌లలో ప్రభుత్వం అద్దె బస్సులను నడిపిస్తూ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆర్టీసీ జేఏసీ అడ్డంకులు కలగకుండా ప్రధాన బస్టాండ్‌ల వద్ద భారీగా పోలీసులను మోహరించింది. ప్రయాణికుల భద్రతతో పాటు రవాణా సౌకర్యాలు కొనసాగించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఇక మంచిర్యాల డిపోలో 142 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయినట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలో కూడా డిపోలకే బస్సులు పరిమితమవడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సమ్మెకు కారణంగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ నాయకుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అయితే పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈరోజు మరోసారి చర్చలకు పిలిచే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

సమ్మె కొనసాగితే ప్రజలకు ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరియు కార్మిక సంఘాల మధ్య చర్చలు సఫలం కావాలని ప్రజలు ఆశిస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..