మన భారత్, వరంగల్:
వరంగల్‌లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఇద్దరు సబ్-రిజిస్ట్రార్లను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. కార్యాలయంలో సిస్టమాటిక్‌గా జరుగుతున్న అక్రమ వసూళ్లపై కీలక ఆధారాలు సేకరించారు.
తనిఖీ సందర్భంగా కార్యాలయంలో పనిచేస్తున్న 20 మంది అనధికార ఏజెంట్లను అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.47,450 నగదు, పత్రాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల నుంచి రిజిస్ట్రేషన్ సేవల పేరుతో నగదు మాత్రమే కాకుండా, UPI, PhonePe వంటి ఆన్‌లైన్ మార్గాల ద్వారా కూడా లంచాలు వసూలు చేస్తున్నట్లు వెల్లడైంది.
మొబైల్ ఫోన్లలో లభించిన డేటా ఆధారంగా కేవలం 8 రోజుల్లోనే సుమారు రూ.16.23 లక్షల వరకు అక్రమ వసూళ్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ఒక అధికారి ఖాతాల్లో రూ.44.28 లక్షల అనుమానాస్పద లావాదేవీలు, మరో అధికారి ఖాతాలో రూ.74,000 ట్రాన్సాక్షన్లు నమోదైనట్లు తెలిసింది.
అదనంగా, నక్కలగుట్ట ప్రాంతంలో సుమారు రూ.72 లక్షల విలువైన కమర్షియల్ ప్రాపర్టీలు కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడింది. కుటుంబ సభ్యుల పేర్లపై ఆస్తులు కొనుగోలు చేసి, ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ల ద్వారా లంచాల వసూళ్లు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ కేసులో అధికార దుర్వినియోగానికి సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాలు లభించగా, ఏప్రిల్ 20, 2026న ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
అవినీతి ఘటనలపై ఫిర్యాదులు అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్ 9440446106 అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
