మన భారత్, తెలంగాణ:
రాష్ట్రవ్యాప్తంగా భానుడి భగభగలతో పగటి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, కొన్ని చోట్ల 44 డిగ్రీలకు పైగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బ బారిన పడి ఇద్దరు వృద్ధులతో పాటు నలుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటనలు వెలుగుచూశాయి.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం మరో రెండు రోజులపాటు ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు ఉండబోదని వెల్లడించింది. కుమరం భీమ్-అసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అసిఫాబాద్, నిర్మల్ జిల్లా బుట్టాపూర్, నిజామాబాద్ జిల్లా మెండోరా ప్రాంతాల్లో 44.5 డిగ్రీలుగా నమోదైంది. ఈ ఏడాది వేసవిలో ఇది అత్యధిక ఉష్ణోగ్రతగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని 104 ప్రాంతాల్లో వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇదే సమయంలో ఆదివారం, సోమవారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు సూచించారు.
ఎండ తీవ్రత కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు రాష్ట్రాన్ని కలవరపరుస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిన్న ఓదెల వాసి దాసరి రమేశ్ (50), రాజన్న-సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపల్లి వాసి నల్లాల మోహన్ (46) నిర్మాణ పనులు చేస్తూ వడదెబ్బకు గురై మృతి చెందారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అడవి లింగాల వాసి లింగాల రాములు (59) పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లి గట్టుపైనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం బోజ్యా నాయక్ తండాకు చెందిన భూక్య జంకు (65) తోటలో పని చేస్తుండగా వడదెబ్బతో కుప్పకూలి మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఇక కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా వర్షాలు కురవడంతో పరిస్థితి కొంత మారింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ, ధర్పల్లి, ఇందల్‌వాయి మండలాలు, సిరిసిల్ల జిల్లా కోనారావుపేట ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షంతో ఆరబోసిన ధాన్యం తడిసిపోయి రైతులు నష్టపోయారు. పలు చోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సాయంత్రం వర్షాలతో కొంత చల్లదనం నెలకొనడంతో సంగారెడ్డి జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎండ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని వైద్యులు సూచిస్తున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
