manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 2:50 am Editor : manabharath

జిల్లా రాజకీయ ముఖచిత్రం మార్పు.!

మన భారత్, ఆదిలాబాద్ రూరల్:

నియోజకవర్గాల పునర్విభజన బిల్లు అమలులోకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయ సమీకరణాలు గణనీయంగా మారనున్నాయి. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, లోక్సభ స్థానాల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి.

ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాలకు అదనంగా మరో నాలుగు నుంచి ఐదు స్థానాలు పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే విధంగా జిల్లాకు కొత్తగా ఒక లోక్సభ స్థానం కూడా కేటాయించే అవకాశముందని సమాచారం. ఈ పరిణామాలు జిల్లాలో రాజకీయ పోటీతత్వాన్ని మరింత పెంచనున్నాయి.

ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు అమలైతే జిల్లాలో నలుగురు మహిళా ఎమ్మెల్యేలకు అవకాశం లభించే అవకాశముంది. దీంతో మహిళా నాయకత్వం పెరగడమే కాకుండా, కొత్త నాయకులకు అవకాశాలు విస్తరించే పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల్లో ఆశావాహుల సంఖ్య పెరుగుతూ, స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్ అంశాలు రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.