manabharath.com
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 3:08 pm Editor : Editor Vishal Kumar

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. ప్రధాన రహదారిపై ఉన్న వైన్ షాపుల వద్ద వాహనాలు రోడ్లపైనే నిలిపివేయడం వల్ల ప్రతిరోజూ ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వం మంజూరు చేసిన రెండు వైన్ షాపుల యజమానులు నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లోని బెల్ట్ షాపులకు అధిక ధరలకు మద్యం విక్రయించడం, పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయకపోవడం వంటి అంశాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

ఇక మద్యం షాప్ పరిసరాల్లో మౌలిక వసతుల కొరత మరింత సమస్యగా మారింది. సిట్టింగ్ ప్రాంతంలో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో మద్యం సేవకులు రోడ్ల పక్కనే మలమూత్ర విసర్జన చేయడం వల్ల దుర్వాసన వ్యాపించి ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యలపై ఇప్పటికే గ్రామపంచాయతీ పాలకవర్గం రెండుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ షాపు యజమానులు స్పందించలేదు. దీంతో శుక్రవారం గ్రామ సర్పంచ్ చాట్ల విజయ, ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి కలిసి మద్యం షాప్ వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ చాట్ల విజయ మాట్లాడుతూ, వెంటనే పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడంతో పాటు మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని యజమానులను హెచ్చరించారు. లేదంటే జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని మద్యం షాప్ యాజమాన్యం వెంటనే స్పందించాలని గ్రామపంచాయతీ కోరుతోంది.

రాజకీయ నాయకులకు శుభవార్త.. https://manabharath.com/7179/

మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..