మన భారత్, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ Centre of Indian Trade Unions (సిఐటియు) ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ ఆర్టిజన్ కార్మికుల ఎంప్లాయిస్ యూనియన్ పిలుపుతో కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి పొదిల రామయ్య మాట్లాడుతూ, ఆర్టిజన్ కార్మికులు గత ఎనిమిది సంవత్సరాలుగా తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారని తెలిపారు. పూర్వ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వ్యవస్థలో కనీస సౌకర్యాలు లేకుండా కార్మికులతో పని చేయించుకుంటున్నారని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 19 వేల మంది ఆర్టిజన్ కార్మికులు ఉండగా, నాగర్ కర్నూల్ జిల్లాలోనే దాదాపు 400 మంది కార్మికులు ఐదు రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్నారని చెప్పారు. అయితే ప్రభుత్వం, యాజమాన్యం ఎలాంటి చర్చలు జరపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కార్మికుల స్థానంలో రెగ్యులర్ ఉద్యోగులను నియమించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆయన మండిపడ్డారు. మీటర్ రీడింగ్, స్తంభాలెక్కడం, సబ్‌స్టేషన్ విధులు నిర్వహించడం వంటి కీలక పనుల్లో ఆర్టిజన్ కార్మికులు నిమగ్నమై ఉన్నప్పటికీ, వారికి సరైన గుర్తింపు, వేతనాలు లభించడం లేదని అన్నారు.
ఈ నేపథ్యంలో ఆర్టిజన్ కార్మికులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, జీవో నెంబర్ 11 ప్రకారం పీస్ రేట్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఐక్య కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు.
ఈ ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, ఉపాధ్యక్షులు వర్ధన్ పర్వతాలు, పసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ నాయకులకు శుభవార్త..!
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
