manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 9:05 am Editor : Editor Vishal Kumar

ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలి.!

మన భారత్, నారాయణపేట: 

నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మోమినాపూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు ఉపాధ్యాయుడు స్వామిని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) నాయకులు డిమాండ్ చేశారు.

ఈ మేరకు పిడిఎస్‌యు మాజీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్. సాయికుమార్ మాట్లాడుతూ, విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండాల్సిన ఉపాధ్యాయులు ఇలాంటి అసభ్యకర చర్యలకు పాల్పడడం సమాజం తలదించుకునే పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో విద్యాబోధనతో పాటు నైతిక విలువలు నేర్పాల్సిన బాధ్యత కలిగిన గురువులు విద్యార్థినులపై వేధింపులకు దిగడం ఉపాధ్యాయ వృత్తికి మచ్చ అని పేర్కొన్నారు.

ఈ సంఘటన సుమారు 15 రోజుల క్రితమే జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి రావడం, ఇప్పటికే మండల, జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. రాజకీయ జోక్యం కారణంగా చర్యలు ఆలస్యం అవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.

విద్యార్థులకు తల్లిదండ్రుల తరువాతి స్థానంలో ఉండే ఉపాధ్యాయుడు ఇలాంటి దారుణానికి పాల్పడటం అత్యంత దురదృష్టకరం అని పేర్కొంటూ, వెంటనే సంబంధిత ఉపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని, అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ), జిల్లా విద్యాశాఖ అధికారి (డిఈఓ)లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని, లేదంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని పిడిఎస్‌యు నాయకులు హెచ్చరించారు.