manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 3:02 am Editor : Editor Vishal Kumar

రోడ్డు ప్రమాదంలో 10 మంది సజీవదహనం..

ప్రకాశం జిల్లా, మన భారత్:

ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు పలకల క్వారీ సమీపంలో టిప్పర్‌ను ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఢీకొన్న వెంటనే టిప్పర్ డీజిల్ ట్యాంక్ పేలిపోవడంతో భారీగా మంటలు చెలరేగి క్షణాల్లోనే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది.

ఈ దుర్ఘటనలో కనీసం 10 మంది సజీవదహనం అయినట్లు ప్రాథమిక సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బస్సులో ముందు భాగంలో కూర్చున్న సుమారు 22 మంది ప్రయాణికులు వెంటనే దిగిపోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే వెనుక భాగంలో కూర్చున్న వారు, పైన పడుకున్న ప్రయాణికులు మంటలు వేగంగా వ్యాపించడంతో బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయారు.

ఈ బస్సు జగిత్యాల నుంచి వింజమూరు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు కనిగిరి, పామూరు ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదానికి అతివేగం మరియు ప్రమాదకరమైన మూలమలుపు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘటన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలను వెలికితీసేందుకు అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.