మన భారత్, హైదరాబాద్, మార్చి 25:
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత మంద కృష్ణ మాదిగ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ డీజీపీకి పది ముఖ్యమైన డిమాండ్లను లిఖితపూర్వకంగా సమర్పించారు. ముఖ్యంగా లాకప్ డెత్‌కు ప్రధాన కారణంగా భావిస్తున్న చిలుకూరు పోలీస్ స్టేషన్ అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని కోరారు. అలాగే కేసు దర్యాప్తును వేగవంతం చేసి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

బాధితుడు కర్ల రాజేష్ తల్లి కర్ల లలిత ఇచ్చిన ఫిర్యాదులను పోలీసు అధికారులు స్వీకరించకపోవడం, కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించడం వంటి అంశాలను ఆయన తీవ్రంగా ఖండించారు. కోదాడ డీఎస్పీలు మరియు సూర్యాపేట ఎస్పీ వ్యవహారంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం ప్రక్రియలో అనుమానాస్పద పరిస్థితులు నెలకొన్నాయని, వీడియో చిత్రీకరణ మరియు డాక్టర్ నియామకంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరారు. అదేవిధంగా బాధిత కుటుంబాన్ని ఒత్తిడి చేసి సెటిల్‌మెంట్‌కు ప్రయత్నించిన అంశంపై కూడా దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు.
ఈ కేసులో సంబంధిత ఎస్ఐ, సిఐలతో పాటు ఇతర పోలీసు సిబ్బందిని తక్షణమే అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు.

ఈ భేటీలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డా. గోవిందు నరేష్ మాదిగ, హైకోర్టు అడ్వకేట్ దున్న అంబేద్కర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు టీవీ నరసింహా, అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్, జిల్లా ఉపాధ్యక్షులు ఇటిక శ్రీకిషన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, దళిత సంఘాలు న్యాయం కోసం ఉద్యమానికి సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
