manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 5:27 pm Editor : Editor Vishal Kumar

రైతు ఆత్మహత్యపై ఆగ్రహం: 

మన భారత్ ఆదిలాబాద్:

రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మండల కన్వీనర్  వెంకన్న మాట్లాడారు.

రాష్ట్రంలో పండిన పంటలను సకాలంలో కొనుగోలు చేయకపోవడం, రైతుబంధు నిధులు విడుదలలో ఆలస్యం వంటి అంశాలతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. అకాల వర్షాల కారణంగా పంట దిగుబడులు దెబ్బతిన్నప్పటికీ, ప్రభుత్వం రైతులను ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

ఇటీవల ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్‌లో ఆదిలాబాద్ రూరల్ మండలం అర్లి (బి) గ్రామానికి చెందిన రైతు తుడుం గణపతి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయాన్ని ప్రస్తావించారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుమందు సేవించి ఆత్మహత్య చేసుకోవడం ఎంతో బాధాకరమని అన్నారు.

ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, రైతుబంధు వంటి కీలక పథకాలను సమర్థంగా అమలు చేయలేకపోతోందని విమర్శించారు. గతంలో కష్టకాలంలో కూడా రైతులకు సహాయం అందించబడిందని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి కిరణ్ కుమార్, యువ నాయకులు అభిరామ్ రెడ్డి, తలమడుగు సర్పంచ్ చంటి, సర్పంచ్ అశోక్, మహేష్ దేశముఖ్, రవికాంత్ యాదవ్, మాజీ సర్పంచ్ రాజేశ్వర్, ఉప సర్పంచ్ రమాకాంత్, మల్లేష్, కార్తీక్ రెడ్డి, రాగి కిషన్, పోచన్న తదితరులు పాల్గొన్నారు.

రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.