manabharath.com
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 7:40 am Editor : manabharath

విద్యార్థిని మృతి కేసులో మలుపు.. రీ-పోస్ట్‌మార్టం

మన భారత్, తాంసి:

నిజామాబాద్ జిల్లా పోచంపాడ్‌లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థిని సాయి లిఖిత మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని లిఖిత మృతదేహానికి మంగళవారం రీ-పోస్ట్‌మార్టం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

మూడు నెలల క్రితం, డిసెంబర్ 8న అస్వస్థతకు గురైన లిఖితను తొలుత స్థానికంగా చికిత్స అందించి అనంతరం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అయితే ఈ ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో విషయం కొత్త మలుపు తిరిగింది.

తల్లిదండ్రులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో సోమవారం కేసు నమోదు చేయబడింది. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని వెలికి తీసి తిరిగి పోస్టుమార్టం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ రీ-పోస్ట్‌మార్టం ద్వారా మృతికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

విద్యార్థిని తండ్రి లింగన్న మాట్లాడుతూ హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన కూతురు మృతి చెందిందని ఆరోపించారు. ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరారు.

అలాగే ఈ ఘటనకు సంబంధించి ఏఎన్ఎం మరణం కూడా అనుమానాస్పదంగా ఉందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అది సహజ మరణమా లేదా యాక్సిడెంట్ రూపంలో హత్య జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ కేసు ప్రస్తుతం స్థానికంగా సంచలనంగా మారగా, రీ-పోస్ట్‌మార్టం నివేదికపై అందరి దృష్టి నిలిచింది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ విషయం లో BRS గౌరవాధ్యక్షులు  KT రామారావ్  ఇటీవల అసెంబ్లీ లో ప్రస్తావించడం తోనే అధికార యంత్రాంగం లో కదలిక వచ్చి సంఘటన జరిగిన మున్నేళ్లకు సోమవారం FIR నమోదు కావడం తో ఇవ్వాళ తాంసి లో శవ రీ- పోస్ట్ మార్టం కొరకు చర్యలు చేపట్టినట్టు బాలిక తండ్రి దేవునూరు లింగన్న తెలిపారు.