manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 5:45 am Editor : Editor Vishal Kumar

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనలు..

మన భారత్, హైదరాబాద్:

హైదరాబాద్‌లోని ఘన్ పార్క్ వద్ద ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ “బడాయిలు చాలించు – బకాయిలు చెల్లించు” అనే నినాదాలతో ఆందోళన చేపట్టారు.

ఈ నిరసనలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని ప్లేకార్డు ప్రదర్శిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడకూడదని, ఫీజుల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.

విద్యా సంస్థలు ఫీజుల కోసం ఒత్తిడి తీసుకువస్తుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆర్థికంగా కుంగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీ రీయింబర్స్‌మెంట్ పథకం సమయానికి అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని, వెంటనే బకాయిలను విడుదల చేసి విద్యార్థుల చదువుకు అడ్డంకులు తొలగించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ బకాయిలను క్లియర్ చేయకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.