manabharath.com
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 4:31 pm Editor : manabharath

గరికపాటి వ్యాఖ్యలపై ఆగ్రహం.. 

మన భారత్, నాగర్‌కర్నూల్:

విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గరికపాటి నరసింహారావుపై ఎస్ఎఫ్ఐ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో గరికపాటి ఫోటోపై కోడిగుడ్లతో నిరసన వ్యక్తం చేస్తూ ఆయనపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఏం తారా సింగ్ మాట్లాడుతూ, పేద విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా గరికపాటి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ప్రవచనాల పేరుతో విద్యార్థులను అవమానకరంగా మాట్లాడటం అమానవీయమని, ముఖ్యంగా విద్యార్థులను “శోభనం పెళ్లికొడుకు”తో పోల్చడం విద్యార్థి లోకాన్ని కించపరచడమేనని అన్నారు.

పేద పిల్లలు కేవలం కోడిగుడ్డు కోసం పాఠశాలకు వస్తున్నారనే వ్యాఖ్యలు వారి పేదరికాన్ని ఎగతాళి చేయడమేనని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల హాజరు పెంచడంలో, చదువు మానివేతలను తగ్గించడంలో, పౌష్టికాహార లోపాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోందని గుర్తు చేశారు. ఈ పథకాన్ని సుప్రీంకోర్టు కూడా అమలు చేయాలని ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు.

ఇలాంటి కీలక పథకాన్ని అవహేళన చేయడం గరికపాటి అజ్ఞానం, బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో తల్లులు, పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న సమయంలో గుడ్డు పంపిణీపై అవమానకర వ్యాఖ్యలు చేయడం ఆకలి, పేదరికాన్ని కించపరచడమేనని తీవ్రంగా ఖండించారు.

విద్యార్థులకు ఉచిత భోజనం, పుస్తకాలు, యూనిఫాంలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని, దానిని “బిచ్చం”గా పేర్కొనడం సిగ్గుచేటని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు భారీ రాయితీలు ఇస్తున్నప్పుడు స్పందించని గరికపాటి, పేద విద్యార్థుల భోజనంపై విమర్శలు చేయడం అన్యాయమని అన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వంశీ, చరణ్, సిద్ధు, మహేష్, అభినందన్, కార్తికేయ, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.