manabharath.com
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 12:08 pm Editor : manabharath

గిరిజనులను దగా చేసిన కాంగ్రెస్ సర్కార్

మన భారత్, ఆదిలాబాద్:

తెలంగాణలో గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తెలంగాణ గిరిజన సంఘం తీవ్ర స్థాయిలో విమర్శించింది. రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎం. ధర్మ నాయక్, ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీరాం నాయక్ సంయుక్త ప్రకటనలో ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో గిరిజనులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి, మూడో ఏడాది బడ్జెట్‌లో కూడా వాటికి తగిన నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. సుమారు 40 లక్షల గిరిజనులను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.

2026–27 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గిరిజన సంక్షేమానికి కేవలం ₹7,937 కోట్లు మాత్రమే కేటాయించడం తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. చేవెళ్ల డిక్లరేషన్‌లో ఇచ్చిన 15 హామీల అమలుకు కనీసం ₹25,000 కోట్లు అవసరమని పేర్కొంటూ, ఈ తక్కువ నిధులతో వాటిని ఎలా అమలు చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

గత రెండు సంవత్సరాల బడ్జెట్లలో గిరిజన సంక్షేమానికి ₹10,158 కోట్లు కేటాయించినప్పటికీ, అందులో కేవలం ₹3,700 కోట్లు మాత్రమే ఖర్చు చేసి, మిగిలిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. ప్రస్తుత బడ్జెట్‌లో కూడా గిరిజన అభివృద్ధికి కీలకమైన రంగాల్లో నిధులను తగ్గించి, కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్న రంగాల్లో పెంచారని విమర్శించారు.

గిరిజనులకు రుణాలు అందించే ట్రైకార్ సంస్థకు గతేడాది ₹300 కోట్లు కేటాయించగా, ఈసారి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం ఆ సంస్థను పూర్తిగా రద్దు చేసే ప్రయత్నంగా భావిస్తున్నామని తెలిపారు. అలాగే గిరిజన యువ వికాసం పేరుతో గతేడాది ₹1,360 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, ఈ ఏడాది కేటాయించిన ₹1,310 కోట్లు కూడా ఖర్చవుతాయన్న నమ్మకం లేదన్నారు.

ఐటీడీఏల అభివృద్ధికి గతేడాది కేటాయించిన ₹75 కోట్లను ఈసారి పెంచకపోవడం, గిరిజన తండాలు, గూడేలలో మౌలిక వసతుల కోసం కేటాయించిన నిధులను వినియోగించకుండానే తిరిగి అదే మొత్తాన్ని చూపించడం అంకెల గారడిగా అభివర్ణించారు.

గిరిజన సబ్ ప్లాన్ నిధులను కూడా గత ఏడాది ₹17,168 కోట్ల నుంచి ప్రస్తుత బడ్జెట్‌లో ₹15,274 కోట్లకు తగ్గించడం గిరిజనులపై నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఖర్చు చేయని నిధులను ఖర్చు చేసినట్లు చూపించి మోసం చేస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని గిరిజన హామీలను అమలు చేయాలని, లేకపోతే గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడతారని తెలంగాణ గిరిజన సంఘం హెచ్చరించింది.