manabharath.com
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 1:07 am Editor : manabharath

సైబర్ మోసాల బాధితులకు గుడ్ న్యూస్

మన భారత్, న్యూఢిల్లీ: 

దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ మోసాల నేపథ్యంలో బాధితులకు తాత్కాలిక ఉపశమనంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ మోసాల్లో డబ్బులు కోల్పోయిన వారికి పరిమిత పరిహారం అందించే విధంగా కొత్త మార్గదర్శకాలను రూపొందించింది.

ఈ పథకం ప్రకారం, రూ.50 వేల వరకు నష్టం చవిచూసిన బాధితులకు మాత్రమే పరిహారం వర్తిస్తుంది. బాధితుడు కోల్పోయిన మొత్తం సొమ్ములో గరిష్టంగా 85 శాతం లేదా రూ.25 వేల వరకు—ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని పరిహారంగా ఇవ్వనున్నారు. ఈ అవకాశం బాధితుడికి ఒక్కసారి మాత్రమే లభిస్తుంది.

అయితే పరిహారం పొందాలంటే కొన్ని కీలక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా డబ్బులు కోల్పోయిన విషయం తెలిసిన 5 రోజులలోపు సంబంధిత బ్యాంకుకు ఫిర్యాదు చేయడం తప్పనిసరి. ఆలస్యమైతే పరిహారం అందకపోవచ్చు అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఈ పరిహారంలో భాగంగా రూ.25 వేలలో సుమారు రూ.19,118ను ఆర్బీఐ భరిస్తుండగా, మిగతా రూ.2,941ను సంబంధిత బ్యాంకు భరిస్తుంది. థర్డ్ పార్టీ ఉల్లంఘనల కారణంగా జరిగే మోసాల దృష్ట్యా బాధితులకు ఆర్థిక భారం తగ్గించడమే ఈ నిర్ణయానికి ముఖ్య ఉద్దేశ్యంగా భావిస్తున్నారు.

పెరుగుతున్న డిజిటల్ లావాదేవీల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్, లింకులు, ఓటీపీ షేరింగ్ వంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కొత్త నిర్ణయం సైబర్ మోసాల బాధితులకు కొంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తుందని భావిస్తున్నారు.