manabharath.com
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 11:22 am Editor : Editor Vishal Kumar

16 నుంచి ఒంటిపూట బడులు.!

మన భారత్, తెలంగాణ: 

తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలల పనివేళల్లో మార్పులు చేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో ఒంటిపూట బడులు (హాఫ్ డే స్కూల్స్) నిర్వహించాలని విద్యాశాఖ జీవో జారీ చేసింది.

విద్యార్థుల ఆరోగ్యం మరియు వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 23 వరకు అన్ని పాఠశాలల్లో హాఫ్ డే క్లాసులు కొనసాగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని పాఠశాలలకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు.

అయితే ఈ నెల 15వ తేదీ ఆదివారం కావడంతో, సోమవారం నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని విద్యాశాఖ పేర్కొంది.

ఇక పదో తరగతి బోర్డు పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల విద్యలో అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పదో తరగతి విద్యార్థులకు అవసరమైన స్పెషల్ క్లాసులు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. పరీక్షలకు సన్నద్ధం కావడానికి అవసరమైన విద్యా సహాయం అందించేలా పాఠశాలలు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఈ నిర్ణయంతో విద్యార్థులు తీవ్రమైన ఎండల నుంచి రక్షణ పొందడంతో పాటు చదువులో కూడా ఇబ్బంది లేకుండా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది.