manabharath.com
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 1:52 am Editor : Editor Vishal Kumar

13న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు.

9.32 కోట్ల మందికి రూ.2 వేల చొప్పున జమ

మన భారత్ ,న్యూఢిల్లీ:

దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థికంగా తోడ్పడేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ (PM-Kisan) పథకం కింద మరో విడత నిధులు విడుదలకు సిద్ధమయ్యాయి. మార్చి 13న ఈ పథకం కింద 22వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుంది.

ఈ విడతలో సుమారు 9.32 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమ చేయనున్నారు. ఈ నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.19 వేల కోట్లను కేటాయించింది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఈ పథకం కీలకంగా మారిందని కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

పీఎం కిసాన్ పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. చిన్న మరియు సన్నకారు రైతులకు వ్యవసాయ ఖర్చులను తగ్గించేందుకు ఈ పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం ప్రకారం ప్రతి ఏడాది మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేల ను రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు.

డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానంలో రైతుల ఖాతాలకు నిధులు చేరుతాయి. దీంతో మధ్యవర్తులు లేకుండా రైతులకు సకాలంలో ఆర్థిక సహాయం అందుతోంది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు కోట్లాది మంది రైతులు లబ్ధి పొందినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఇక మార్చి 13న విడుదల కానున్న తాజా విడత నిధులతో రైతులు రాబోయే వ్యవసాయ సీజన్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు ఉపశమనం కలగనుంది. రైతులు తమ బ్యాంకు ఖాతా, ఆధార్ లింక్ వంటి వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.