manabharath.com
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 1:36 pm Editor : Editor Vishal Kumar

థైరాయిడ్ నియంత్రణ మీ చేతుల్లోనే.!

మన భారత్, ఆరోగ్యం: 

ప్రస్తుతం మహిళల్లో థైరాయిడ్ సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయి. గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంధి శరీరంలోని మెటబాలిజం, హార్మోన్ల సమతుల్యతను నియంత్రించే కీలక అవయవం. ఈ గ్రంధి సరిగా పనిచేయకపోతే అలసట, ఆకలి మార్పులు, బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, చర్మం పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

వైద్యులు సూచిస్తున్నట్లుగా మందులతో పాటు ఆహారపు అలవాట్లలో మార్పులు తప్పనిసరి. తేలికగా జీర్ణమయ్యే, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా సొరకాయ, బీరకాయ, దానిమ్మ, బొప్పాయి వంటి కూరగాయలు, పండ్లు శరీరానికి మేలు చేస్తాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది.

అయితే క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కొన్ని కూరగాయలను మితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అధిక చక్కెర ఉన్న పండ్లు, వేడి చేసిన నూనెలతో తయారు చేసిన వంటలు, ఫ్రైడ్ పదార్థాలు తగ్గించడం మంచిది. ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్‌ను పూర్తిగా నివారించాలి.

ఆహారంతో పాటు రోజువారీ వ్యాయామం, యోగా, సరిపడ నిద్ర, ఒత్తిడి తగ్గించడం కూడా థైరాయిడ్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా హైపోథైరాయిడ్ సమస్య ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే డైట్ ప్లాన్ మార్చుకోవాలి.

సమతుల ఆహారం, నియమిత జీవనశైలి, వైద్యుల సూచనలు పాటిస్తే థైరాయిడ్ సమస్యను నియంత్రణలో ఉంచుకోవచ్చు.