మన భారత్ , సినిమా:
తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రానికి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే టైటిల్ ఖరారైన సంగతి తెలిసిందే. అయితే ఈ టైటిల్ ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
మూవీ టీమ్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు తమిళం, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే ఉండటం నెటిజన్ల అసంతృప్తికి కారణమైంది. తెలుగులో టైటిల్ పోస్టర్ లేకపోవడంపై అభిమానులు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. “తెలుగు డైరెక్టర్ సినిమా అయితే తెలుగులో టైటిల్ ఎందుకు లేదు?”, “తెలుగంటే నిర్లక్ష్యమా?” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న నేపథ్యంలో విభిన్న భాషల్లో ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పోస్టర్ విడుదల చేయకపోవడం సరైన నిర్ణయమా అనే చర్చ జరుగుతోంది.
సినిమా కథా నేపథ్యం, నటీనటులు, నిర్మాణ సంస్థ తదితర వివరాలపై త్వరలో మరిన్ని అప్డేట్లు ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం టైటిల్ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

తెలుగు ప్రేక్షకులు తమ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక చిత్రబృందం ఈ విమర్శలకు ఎలా స్పందిస్తుందో చూడాలి.