manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 February 2026, 9:52 am Editor : manabharath

33 గంటల ట్రాఫిక్ నరకం.. ముంబై–పుణే ఎక్స్ప్రెస్‌వేపై స్తంభనం, హెలికాప్టర్‌లో వెళ్లిన పారిశ్రామికవేత్త!

మన భారత్ , మహారాష్ట్ర:

మహారాష్ట్రలోని ముంబై–పుణే ఎక్స్ప్రెస్‌వేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో భీకర ట్రాఫిక్ జామ్ నెలకొంది. దాదాపు 33 గంటల పాటు వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర సేవలు కూడా నెమ్మదించడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

8 గంటలు కారులోనే… చివరికి హెలికాప్టర్ ప్రయాణం

ఈ ట్రాఫిక్‌లో చిక్కుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త సుధీర్ మెహతా దాదాపు 8 గంటల పాటు కారులోనే వేచి ఉన్నారు. పరిస్థితి సాధారణ స్థితికి రాకపోవడంతో చివరకు హెలికాప్టర్ పిలిపించుకుని పుణేకు బయలుదేరినట్లు ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఎమర్జెన్సీ హెలిప్యాడ్స్ అవసరం

ఈ సంఘటన నేపథ్యంలో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వినియోగించుకునేలా ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో హెలిప్యాడ్స్ ఏర్పాటు చేయాలని సుధీర్ మెహతా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భారీ ట్రాఫిక్ జామ్‌ల సమయంలో అత్యవసర వైద్య, భద్రతా సేవలకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

 ట్రాఫిక్ నియంత్రణపై ప్రశ్నలు

గ్యాస్ ట్యాంకర్ ప్రమాదం తర్వాత క్లీనప్ ఆపరేషన్లు, భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ వాహనాల రాకపోకలు పూర్తిగా పునరుద్ధరించడానికి గంటల సమయం పట్టింది. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, ప్రమాదాల నివారణ చర్యలపై అధికారులు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు అభిప్రాయపడ్డారు.

ఈ ఘటనతో ముంబై–పుణే మార్గంలో ప్రయాణించే వేలాది మంది తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.