manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 11:15 pm Editor : manabharath

ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా లంచాలు… TGSPDCLలో 8 మంది అధికారుల సస్పెన్షన్

మన భారత్, తెలంగాణ:

వినియోగదారుల నుంచి డిజిటల్ చెల్లింపుల రూపంలో లంచాలు స్వీకరించిన విద్యుత్ అధికారులపై Telangana Southern Power Distribution Company Limited (TGSPDCL) కఠిన చర్యలు తీసుకుంది. డిస్కమ్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశాల మేరకు 8 మంది అధికారులను సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఫైళ్ల క్లియరెన్స్, కొత్త విద్యుత్ కనెక్షన్లు, రెగ్యులర్ సేవల కోసం వినియోగదారుల నుంచి డబ్బు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టగా, ఆరోపణలు నిజమని తేలింది. ముఖ్యంగా ఫోన్‌పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపు యాప్‌ల ద్వారా లంచాలు తీసుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది.

సస్పెండ్ చేసిన వారిలో ఒక అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ADE), ముగ్గురు ఇంజనీర్లు సహా మొత్తం 8 మంది ఉన్నట్లు సమాచారం. దక్షిణ డిస్కమ్ పరిధిలో 150కి పైగా ఫిర్యాదులు అందడంతో అధికారులు ప్రత్యేక దర్యాప్తు నిర్వహించారు.

డిజిటల్ పేమెంట్స్ ద్వారా అక్రమ లావాదేవీలు జరిపినట్లు ఆధారాలు లభించడంతో సంబంధిత అధికారులపై వెంటనే సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. వినియోగదారుల నుంచి ఎటువంటి అక్రమ వసూళ్లు జరిగితే కఠిన చర్యలు తప్పవని TGSPDCL స్పష్టం చేసింది.

విద్యుత్ సేవల్లో పారదర్శకత కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్, ఫిర్యాదు వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఏవైనా అక్రమ వసూళ్లకు గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.