సామాజిక చైతన్యానికి ఇదే నిదర్శనం: రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్
మన భారత్, తెలంగాణ:
రాష్ట్ర మునిసిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు 61 శాతానికి పైగా స్థానాలను కైవసం చేసుకోవడం పట్ల Telangana State Backward Classes Commission హర్షం వ్యక్తం చేసింది. బుధవారం కమిషన్ చైర్మన్ జి. నిరంజన్‌తో పాటు సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం మునిసిపాలిటీల్లో బీసీలకు 28.22 శాతం, మునిసిపల్ కార్పొరేషన్లలో 35.25 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పటికీ, జనరల్ స్థానాల్లో కూడా బీసీ అభ్యర్థులు విశేష విజయాలు సాధించడం గమనార్హమని తెలిపారు. ఇది రిజర్వేషన్లకు అతీతంగా బీసీ వర్గాల్లో పెరుగుతున్న రాజకీయ చైతన్యానికి నిదర్శనమని కమిషన్ అభిప్రాయపడింది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ 52.76 శాతం మంది బీసీలు విజయం సాధించారని పేర్కొంటూ, స్థానిక సంస్థల్లో బీసీ వర్గాల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతోందని వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాజిక న్యాయం, సమాన అవకాశాల సాధనలో ఈ విజయాలు కీలక మైలురాయిగా నిలుస్తాయని కమిషన్ పేర్కొంది.
బీసీ వర్గాల విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో చైతన్యం పెరగడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని, భవిష్యత్తులోనూ స్థానిక సంస్థల్లో వారి పాత్ర మరింత బలపడుతుందని కమిషన్ ఆశాభావం వ్యక్తం చేసింది. సమగ్ర అభివృద్ధి దిశగా ఇది సానుకూల పరిణామమని తెలిపింది.
