manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 3:17 am Editor : manabharath

🌙 ఆకాశంలో నెలవంక దర్శనం.. నేటి నుంచే రంజాన్ ప్రారంభం

మన భారత్, హైదరాబాద్:

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. సౌదీ అరేబియాలో నెలవంక దర్శనమిచ్చినట్లు మతపెద్దలు ప్రకటించడంతో ఫిబ్రవరి 18 నుంచి ఉపవాసాలు ఆరంభమయ్యాయి. పవిత్ర స్థలమైన మక్కా మసీదు పరిసరాల్లో నెలవంక కనిపించిందని అధికారులు వెల్లడించారు. దీనిపై సౌదీ సుప్రీం కోర్టు కూడా అధికారిక ధృవీకరణ ఇచ్చింది.

సౌదీ ప్రకటనను అనుసరించే భారత్ సహా అనేక దేశాల్లో కూడా రంజాన్ ప్రారంభమైనట్లు మతపెద్దలు పేర్కొన్నారు. దాదాపు 31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో రంజాన్ మాసం ప్రారంభమవడం విశేషంగా చెప్పబడుతోంది. గతంలో 1995 ఫిబ్రవరి 1న రంజాన్ ప్రారంభమైనట్లు సమాచారం.

రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఉపవాసాలు, ప్రత్యేక ప్రార్థనలు, దానధర్మాలతో ఈ పవిత్ర మాసాన్ని ఆచరిస్తారు.

ఇదిలా ఉండగా, రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపవాసాలు పాటించే ఉద్యోగుల సౌకర్యార్థం ఈ నెల 19 నుంచి వచ్చే నెల 20 వరకు సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకునేలా అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై ముస్లిం ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.