manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 February 2026, 8:35 am Editor : manabharath

కరువుపై విజయం.. గ్రామస్తుల ఐకమత్యం

మన భారత్, మహారాష్ట్ర:

ఒకప్పుడు 700 అడుగుల లోతున బోర్లు వేసినా చుక్క నీరు దొరకని దుర్భర పరిస్థితి… వేసవికాలంలో ట్యాంకర్లపై ఆధారపడిన జీవనం… ఇదే పరిస్థితి ఎదుర్కొన్న మహారాష్ట్రలోని బన్సావర్గావ్ గ్రామం నేడు దేశానికి ఆదర్శంగా నిలిచింది. గ్రామస్థుల ఐకమత్యం, పట్టుదల, సంకల్పం కరవును జయించి “ట్యాంకర్ రహిత గ్రామం”గా మలిచాయి.

గ్రామ ప్రజలు సమస్యను ప్రభుత్వంపై వదిలేయకుండా స్వయంగా పరిష్కార దిశగా అడుగులు వేశారు. అందరూ కలిసి కాలువలు తవ్వడం, వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం, చెక్ డ్యామ్ల నిర్మాణం వంటి పనులను సమిష్టిగా పూర్తి చేశారు. ముఖ్యంగా బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్) అమలు చేయడంతో నీటి వినియోగం గణనీయంగా తగ్గింది.

ఈ సమగ్ర చర్యల ఫలితంగా భూగర్భ జలాలు మళ్లీ పెరిగాయి. ఒకప్పుడు ఎండిపోయిన బావులు, బోర్లు నేడు నీటితో నిండాయి. రైతులు రెండో పంటలు వేసే స్థాయికి చేరుకున్నారు. పశువుల కోసం కూడా నీటి కొరత లేకుండా మారింది.

గ్రామ పెద్దలు చెబుతున్నదేమిటంటే  “సమస్య ఎంత పెద్దదైనా, ఐకమత్యం ఉంటే పరిష్కారం సాధ్యమే.” ప్రజల భాగస్వామ్యం, శ్రమదానం, సహకారం ఉంటే గ్రామాభివృద్ధి సుసాధ్యం అని ఈ గ్రామం నిరూపించింది.

ప్రకృతిని దోచుకోవడం కాదు, సంరక్షించడం ద్వారానే భవిష్యత్తు భద్రమవుతుందని బన్సావర్గావ్ గ్రామం చాటి చెబుతోంది. కరవును జయించిన ఈ ఐకమత్య గాథ దేశవ్యాప్తంగా గ్రామాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది.