మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ పట్టణంలోని 35వ వార్డు కౌన్సిలర్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మౌనిక స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. అధికారిక లెక్కల ప్రకారం మౌనికకు 735 ఓట్లు పోలవ్వగా, సమీప స్వతంత్ర అభ్యర్థి నసీం జహాకు 715 ఓట్లు లభించాయి. దీంతో కేవలం 20 ఓట్ల తేడాతో మౌనిక విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
35 వ వార్డులో ఈ పోరు ఉత్కంఠభరితంగా సాగింది. చివరి రౌండ్ వరకు ఫలితం ఆసక్తికరంగా మారగా, తుది లెక్కింపులో మౌనిక ఆధిక్యం సాధించడం విశేషంగా మారింది. ఫలితాలు వెలువడగానే బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని మౌనిక తెలిపారు. ముఖ్యంగా పారిశుధ్యం, తాగునీటి సదుపాయం, రహదారుల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల లెక్కింపు పూర్తవడంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. 35వ వార్డు ఫలితం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.