manabharath.com
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 8:09 pm Editor : manabharath

బండి సంజయ్‌కు కనీసం పీఎం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వరు: సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు

మన భారత్, తెలంగాణ:

కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ ముందు నిలబడి తెలంగాణకు నిధులు అడిగే ధైర్యం బండి సంజయ్‌కు లేదని, కనీసం ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా ఆయనకు లభించడంలేదని సీఎం ఆరోపించారు.

కరింనగర్ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాటం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై మాట్లాడే స్థాయి బండి సంజయ్‌కు లేదని అన్నారు.

బండి సంజయ్‌కు నిజంగా ప్రధాని మోదీ వద్ద పరపతి ఉంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్ రావులను అరెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. అలాగే కారు దందాలో అక్రమంగా సంపాదించారన్న ఆరోపణలు ఉన్న కేటీఆర్‌పై కూడా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ప్రశ్నించారు.

బీజేపీ నేతలు మాటల్లో విమర్శలు చేస్తారే తప్ప, కేంద్రంలో అధికారంలో ఉండి కూడా తెలంగాణకు న్యాయం చేయలేకపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, ఎన్నికల సమయంలో తగిన సమాధానం ఇస్తారని వ్యాఖ్యానించారు.

తెలంగాణ అభివృద్ధికి అవసరమైన నిధులు, హక్కుల కోసం తాము ఎప్పటికీ పోరాడుతామని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు.