manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 1:00 pm Editor : Editor Vishal Kumar

మహిళా పోలీసు సిబ్బందికి ప్రత్యేక విశ్రాంతి గది ప్రారంభం

మన భారత్, ఆదిలాబాద్:

జిల్లాలో మహిళల భద్రత, రక్షణకు తొలి ప్రాధాన్యత ఇస్తూ పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు పోలీస్ స్టేషన్‌ ను ఆయన పరిశీలించారు.

తలమడుగు పోలీస్ స్టేషన్‌లో మహిళా పోలీసు సిబ్బంది నిత్యవసర పనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నూతన విశ్రాంతి గదిని జిల్లా ఎస్పీ శాస్త్రోక్తంగా, వేద మంత్రోచరణల నడుమ ప్రారంభించారు. మహిళా ఎస్ఐ డి. రాధిక రిబ్బన్ కట్ చేసి గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం ద్వారా వారి పనితీరును మరింత మెరుగుపరచడమే లక్ష్యమని ఎస్పీ తెలిపారు.

మహిళల భద్రత కోసం జిల్లాలో త్వరలో మహిళా పోలీసు సిబ్బందితో ప్రత్యేక పెట్రోలింగ్ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. మహిళల రక్షణ కోసం షీ టీం 24 గంటలు అందుబాటులో ఉంటూ నిరంతర భద్రత చర్యలు చేపడుతోందని తెలిపారు. అలాగే పోలీస్ అక్క కార్యక్రమం ద్వారా మహిళలు, చిన్నారులకు మరింత దగ్గరగా చేరువవుతున్నామని, ఆపరేషన్ జ్వాల కింద కరాటే శిక్షణ కూడా అందిస్తున్నామని చెప్పారు.

మహిళలపై జరిగే నేరాల నివారణకు పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ చైతన్యం కల్పిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం తలమడుగు పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించిన ఆయన, రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు చేయాలని, ఎలాంటి పెండెన్సీ లేకుండా బాధితుల సమస్యలను బాధ్యతాయుతంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి కోర్టుల్లో చార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, రూరల్ సీఐ కె. ఫణిధర్, తలమడుగు ఎస్ఐ డి. రాధిక తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.