మన భారత్ | తెలంగాణ:
రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ నోటీసులను రాజకీయ ఆయుధాల్లా ఉపయోగిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. కోల్ స్కామ్ అంశంపై ప్రశ్నలు లేవనెత్తడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే తనకు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
సింగరేణి కోల్ స్కామ్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల్లోనే మాజీ ఎంపీ సంతోష్‌కు కూడా సిట్ నోటీసులు అందడం యాదృచ్ఛికం కాదని హరీశ్ రావు పేర్కొన్నారు. ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేపట్టిన చర్యగా అభివర్ణించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై ప్రతిపక్ష గొంతును నొక్కే ప్రయత్నంగా సిట్ నోటీసులు మారాయని విమర్శించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ తరహా చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు.
ఇదిలా ఉండగా, సింగరేణి కుంభకోణంపై పూర్తి వివరాలతో మంగళవారం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వెల్లడించింది. ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి పెంచే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.