మన భారత్ , తెలంగాణ:
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన, ఎల్లుండి తిరిగి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన అనుచరులతో సమావేశమై బీజేపీని వీడాలనే తుది నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఆరూరి రమేశ్ 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అదే పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం 2024 మార్చిలో బీజేపీలో చేరిన ఆయన, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు.
బీఆర్ఎస్ అధినేతల ఆహ్వానం మేరకు తిరిగి పార్టీలో చేరుతున్నట్లు ఆరూరి రమేశ్ ప్రకటించారు. పార్టీ మార్పు నిర్ణయం వర్ధన్నపేట రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయనతో పాటు పలువురు అనుచరులు కూడా బీఆర్ఎస్‌లో చేరే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ పరిణామం రాబోయే రాజకీయ సమీకరణలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.