మన భారత్, ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా బాధ్యత వహించాలని రూరల్ సీఐ ఫణిదర్ పేర్కొన్నారు. తాంసి నుంచి అంబుగామ గ్రామం వరకు సుమారు 5 కిలోమీటర్ల రహదారిపై మూల మలుపుల వద్ద పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ ప్రమాదాలకు నెలవుగా మారాయి.
ఈ సమస్యను గుర్తించిన అంబుగామ గ్రామ సర్పంచ్ తూర్పా భాయి యశ్వంత్ ప్రజల భద్రత దృష్ట్యా రూ.20 వేల సొంత ఖర్చుతో జేసీబీ సహాయంతో ఆదివారం పిచ్చి మొక్కలను తొలగించే పనులు చేపట్టారు. ఈ పనులు సీఐ ఫణిదర్ సమక్షంలో చేపట్టడంతో పాటు రహదారి పూర్తిగా దర్శనీయంగా మారి వాహన రాకపోకలు సులభతరమయ్యాయి.
ప్రజల ప్రాణాల రక్షణ కోసం ముందుకొచ్చిన సర్పంచ్ తూర్పా భాయి యశ్వంత్‌ను సీఐ ఫణిదర్ ప్రత్యేకంగా అభినందించారు. రహదారి భద్రత విషయంలో ఇలాంటి చర్యలు మరింత అవసరమని, ప్రమాదాల నివారణకు స్థానిక ప్రజాప్రతినిధుల చొరవ కీలకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై జీవన్ రెడ్డి కూడా పాల్గొని, రహదారి భద్రతపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేగ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల పాటించడం ద్వారానే ప్రమాదాలను తగ్గించవచ్చని పోలీసులు స్పష్టం చేశారు.