manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 January 2026, 10:09 am Editor : manabharath

సా.5 గంటలకు మేడారంలో చారిత్రాత్మక క్యాబినెట్ భేటీ..

సీఎం రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం

మన భారత్, తెలంగాణ:

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 5 గంటలకు మేడారంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి మేడారంలోని హరిత హోటల్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం 4.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకోనున్నారు. అనంతరం నిర్ణీత సమయానికి మంత్రివర్గ సమావేశాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర అభివృద్ధి, గిరిజన ప్రాంతాల సంక్షేమం, కీలక విధాన నిర్ణయాలపై ఈ క్యాబినెట్ భేటీలో చర్చ జరగనుందని సమాచారం.

క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మేడారం పరిసరాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సీఎం పరిశీలించనున్నారు. అలాగే రేపు వన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మేడారంలో క్యాబినెట్ సమావేశం నిర్వహించడం ద్వారా గిరిజన ప్రాంతాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత మరింత స్పష్టమవుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ చారిత్రాత్మక సమావేశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొనగా, మేడారం మరోసారి తెలంగాణ రాజకీయ కేంద్రబిందువుగా మారింది.