వానాకాలం సీజన్‌కు MSP కింద కందుల కొనుగోళ్లు ప్రారంభం
మన భారత్, తెలంగాణ | ఖమ్మం:
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వానాకాలం 2025–26 సీజన్‌కు సంబంధించి కనీస మద్దతు ధర (MSP) కింద కందుల కొనుగోళ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు.
ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి తుమ్మల పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతులకు లాభదాయక ధరలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, టీజీ మార్క్‌ఫెడ్ సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా MSP కొనుగోళ్లు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 4,99,393 ఎకరాల్లో కందులు సాగవుతున్నాయని మంత్రి వివరించారు.
కొనుగోలు కేంద్రాల ప్రారంభం
ఈ సాగు విస్తీర్ణం ఆధారంగా సుమారు 2,99,635 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. రైతులకు గిట్టుబాటు కల్పించేందుకు క్వింటాల్‌కు రూ.8,000 MSPను ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు రూ.7,200 వరకు మాత్రమే ఉండటంతో రైతులకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని చెప్పారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 1,71,310 మెట్రిక్ టన్నుల కందుల కొనుగోలుకు అనుమతి లభించిందని మంత్రి వెల్లడించారు. 2025 డిసెంబర్ 27 నుంచి 2026 మార్చి 26 వరకు MSP కింద కొనుగోళ్లు కొనసాగుతాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 82 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించగా, ఇప్పటికే 13 కేంద్రాలు ప్రారంభించామని వివరించారు.
జనవరి 16 నాటికి 32 మంది రైతుల నుంచి 30.25 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేసే అవకాశం ఉందని, వీటి మొత్తం విలువ సుమారు రూ.0.24 కోట్లుగా అంచనా వేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు.
మధ్యవర్తులకు పంటను అమ్మొద్దు
నారాయణపేట జిల్లాలో MSP కొనుగోళ్లు సజావుగా కొనసాగుతున్నాయని తెలిపారు. పంటల రాకలను బట్టి ఇతర జిల్లాల్లో కూడా దశలవారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రైతులు మధ్యవర్తులకు పంటను విక్రయించి నష్టపోవద్దని విజ్ఞప్తి చేశారు. టీజీ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాలకు మాత్రమే పంటను తీసుకురావాలని సూచించారు.
కొనుగోలు చేసిన పంటల మొత్తాన్ని డీబీటీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన అజెండా అని, అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు.