మన భారత్, రాజన్న సిరిసిల్ల:
కేసీఆర్ పాలనలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిని పూర్తిగా పట్టించుకోలేదని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేములవాడ రాజన్న ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తూ భక్తులకు మరింత సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.
వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ జంక్షన్ అభివృద్ధి పనులకు శుక్రవారం మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
నిధులు కేటాయించాం..
మేడారం సమ్మక్క–సారక్క, వేములవాడ రాజన్న ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏకకాలంలోనే ప్రత్యేక నిధులు కేటాయించారని మంత్రి సీతక్క తెలిపారు. సమ్మక్క–సారలమ్మ చరిత్ర, వారి విశిష్టతను రాళ్లపై శిలాశాసనాల రూపంలో లిఖిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో రాజన్నను దర్శించుకుంటే నష్టం జరుగుతుందంటూ దుష్ప్రచారాలు చేశారని, అయినప్పటికీ వేములవాడ రాజన్నను ఎంతోమంది భక్తులు తమ ఇంటి ఇలవేల్పుగా కొలుస్తున్నారని ఆమె అన్నారు.
ప్రస్తుతం వేములవాడకు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి రాజన్నకు మొక్కులు చెల్లించుకుంటున్నారని మంత్రి తెలిపారు. రాజన్నపై ఉన్న అపారమైన నమ్మకమే భక్తులను ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా స్వామివారిని భక్తులు పూజిస్తున్నారని అన్నారు.
తెలంగాణ సార్వత్రిక ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తాను వేములవాడ రాజన్నను దర్శించుకున్నామని మంత్రి సీతక్క గుర్తు చేశారు. అలాగే మేడారం సమ్మక్క–సారక్క అమ్మవార్ల నుంచి పాదయాత్ర ప్రారంభించామని తెలిపారు. ప్రతి దేవాలయానికి దాని ప్రత్యేకత, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంటుందని, వాటిని కాపాడుతూ అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.