manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 January 2026, 4:07 pm Editor : manabharath

సంక్రాంతి క్రికెట్‌ టోర్నీ విజేతగా జీవైసీ..

తాంసిలో ఉత్సాహంగా టీపీఎల్‌ సంక్రాంతి కప్‌ పోటీలు

మన భారత్, తాంసి: తాంసి ప్రీమియర్ లీగ్‌ (టీపీఎల్‌) కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి క్రికెట్‌ కప్‌ పోటీలు క్రీడాభిమానులను అలరించాయి. పండుగ వాతావరణంలో హోరాహోరీగా సాగిన ఈ టోర్నీలో స్థానిక యువత ఉత్సాహంగా పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటింది.

ఈ పోటీల్లో విద్యానగర్‌, ఆటో యూనియన్‌, అంబేద్కర్‌ యువజన సంఘం, జ్ఞానోదయ యువజన సంఘం (జీవైసి) పేరుతో మొత్తం నాలుగు జట్లు పోటీపడ్డాయి. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ల అనంతరం జ్ఞానోదయ యువజన సంఘం జట్టు విజేతగా నిలిచి సంక్రాంతి కప్‌ను కైవసం చేసుకుంది.

ఫైనల్‌ పోటీలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జీవైసి జట్టు నిర్ణీత 8 ఓవర్లలో 45 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఏవైసీ జట్టు జీవైసి బౌలర్ల ధాటికి తట్టుకోలేక ఐదు ఓవర్లలో కేవలం 18 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. దీంతో జీవైసి జట్టు ఘన విజయం సాధించింది.

టోర్నీలో విజేతగా నిలిచిన జ్ఞానోదయ యువజన సంఘం జట్టుకు టీపీఎల్‌ చైర్మన్‌ రత్న ప్రకాష్‌ బహుమతి మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా పోటీలు యువతలో ఐక్యతను పెంపొందిస్తాయని, ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడతాయని తెలిపారు.