51.92 లక్షల మంది ఓటర్లు
మన భారత్ | తెలంగాణ:
తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 51,92,220 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం.
తుది ఓటర్ల జాబితా వివరాల ప్రకారం మొత్తం ఓటర్లలో 25,37,136 మంది పురుష ఓటర్లు ఉండగా, 26,54,453 మంది మహిళా ఓటర్లు నమోదయ్యారు. అదేవిధంగా 631 మంది ఇతర ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గత ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో నిర్వహించనున్న ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రారంభించింది. ఓటర్ల జాబితా తుది రూపం దాల్చడంతో ఎన్నికల ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై దృష్టి సారిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ఈ నెల 17న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. షెడ్యూల్ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణతో పాటు పోలింగ్ తేదీలపై స్పష్టత రానుంది. మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనున్న నేపథ్యంలో ఓటర్ల భాగస్వామ్యం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.