manabharath.com
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 3:49 pm Editor : manabharath

ఫిబ్రవరి లోనే పరిషత్‌ ఎన్నికలు..!

రూ.550 కోట్ల కేంద్ర నిధుల కోసం సర్కారు తొందర

మన భారత్ | తెలంగాణ: రాష్ట్రంలో మునిసిపల్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలోపే పరిషత్‌ ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) ముగిసేలోగా జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లకు సంబంధించిన పాలకమండళ్లను ఎన్నుకోకపోతే… 15వ ఆర్థిక సంఘం ద్వారా కేటాయించిన భారీ నిధులు మురిగిపోనున్న పరిస్థితి నెలకొనడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలోనే పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

15వ ఆర్థిక సంఘం కింద తెలంగాణకు ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.3 వేల కోట్ల నిధులు రావాల్సి ఉంది. ఇందులో పంచాయతీల వాటా రూ.2,450 కోట్లు కాగా, జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లకు రూ.550 కోట్లు కేటాయించారు. అయితే పాలకమండళ్లు లేకపోవడం వల్ల ఈ నిధులు విడుదలయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసితే ఈ మొత్తమంతా మురిగిపోతుందన్న ఆందోళనతో ప్రభుత్వం వెంటనే చర్యలకు దిగింది.

ఇప్పటికే పంచాయతీ ఎన్నికల ప్రక్రియను డిసెంబరులో పూర్తిచేసిన ప్రభుత్వం, జనవరిలో పాలకమండళ్ల వివరాలను 15వ ఆర్థిక సంఘానికి పంపింది. అయితే ఆ వివరాల పరిశీలనకు కేంద్రానికి కనీసం 20 నుంచి 30 రోజుల సమయం అవసరమని అధికారిక సమాచారం రావడంతో… జిల్లా, మండల పరిషత్‌ల ఎన్నికలను కూడా ఆలస్యం చేయకుండా నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. 15వ ఆర్థిక సంఘం గడువు ఈ ఆర్థిక సంవత్సరంతోనే ముగియనున్న నేపథ్యంలో, గరిష్ఠంగా నెల రోజుల ముందే పరిషత్‌ పాలకమండళ్లను ఎన్నుకోవాల్సి ఉంటుందన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది.

మునిసిపాలిటీ ఎన్నికల ప్రక్రియ జనవరి చివరి వారంలో ప్రారంభమై ఫిబ్రవరి రెండో లేదా మూడో వారంలో ముగియనున్నట్లు ఇప్పటికే సంకేతాలు ఉన్నాయి. దీంతో పురపోరు ముగిసిన వెంటనే పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసి, ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి పరిషత్‌లు, పంచాయతీలు, మునిసిపాలిటీల పాలకమండళ్ల పదవీకాలం ఏడాదిన్నర క్రితమే ముగిసినా… రిజర్వేషన్ల అంశంతో ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి.

ఆర్థిక సంఘం నిధులు మురిగిపోకుండా…

పాలకమండళ్లు లేకుండా ఆర్థిక సంవత్సరం ముగిస్తే, కేంద్రం నుంచి రావాల్సిన రూ.3 వేల కోట్ల నిధులు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. మరోవైపు 15వ ఆర్థిక సంఘం గడువు ముగియడంతో కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి 16వ ఆర్థిక సంఘం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో పెండింగ్‌ నిధుల విడుదల కోసం ప్రభుత్వం కాలపరిమితిలోపే ఎన్నికలు నిర్వహించడంపై దృష్టి పెట్టింది.

బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్‌ యోచన

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటం, రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు, హైకోర్టులు స్పష్టం చేసిన నేపథ్యంలో… అధికార కాంగ్రెస్‌ పార్టీ కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పరిషత్‌ ఎన్నికల్లో చట్టపరంగా కాకుండా పార్టీ పరంగా బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయించి ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగినప్పటికీ, 50 శాతం కంటే ఎక్కువ చోట్ల బీసీలకే అభ్యర్థిత్వం ఇచ్చామని కాంగ్రెస్‌ నేతలు గుర్తు చేస్తున్నారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లలో ఎస్సీ, ఎస్టీ జనాభా తక్కువగా ఉండటంతో వారి రిజర్వేషన్లు తగ్గే అవకాశముందని, ఆ మేరకు బీసీల వాటాను పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మునిసిపల్‌ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ను సుమారు 32–33 శాతంగా ఖరారు చేసే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మొత్తంగా చూస్తే… కేంద్ర నిధులు చేజారిపోకుండా ఉండాలన్న ఆర్థిక ఒత్తిడి, రిజర్వేషన్లపై రాజకీయ వ్యూహాలతో రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికలు ఫిబ్రవరిలోనే జరగనున్నాయన్న అంచనాలు బలపడుతున్నాయి.