💥సంక్రాంతి పండుగతో ఖాళీ అవుతున్న హైదరాబాద్..
మన భారత్ తెలంగాణ:
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. భాగ్యనగరం పల్లె బాట పడుతుంది. ఏటా కనిపించే ఈ దృశ్యం ఈ ఏడాదీ యథావిధిగా పునరావృతమవుతోంది. ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్‌లో స్థిరపడిన లక్షలాది మంది నగరవాసులు స్వగ్రామాల బాట పట్టడంతో నగరం క్రమంగా ఖాళీ అవుతోంది. గడిచిన మూడు రోజుల్లోనే హైదరాబాద్ నుంచి సుమారు 30 లక్షల మందికి పైగా ప్రయాణికులు తమ స్వస్థలాలకు తరలివెళ్లినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
నగరంలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. కుటుంబాలతో కలిసి ఊళ్లకు వెళ్లేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో బయలుదేరడంతో నగరమంతా పండుగ వాతావరణం నెలకొంది.
బస్టాండ్ల వద్ద భారీ రద్దీ..
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో ప్రధాన కూడళ్లు కిటకిటలాడుతున్నాయి. దిల్‌సుక్‌నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, జేబీఎస్ బస్టాండ్లలో ప్రయాణికుల తాకిడి విపరీతంగా పెరిగింది. బస్టాండ్లు నిండిపోయినా సమయానికి బస్సులు రాకపోవడంతో మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బస్టాండ్లలో కిక్కిరిసిన ప్రయాణికులు..
స్వగ్రామాలకు చేరుకోవాలనే ఆత్రుతతో నగరవాసులు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. టిక్కెట్లు దొరకక, బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ముఖ్యంగా కుటుంబాలతో వచ్చినవారికి పరిస్థితి మరింత దుర్భరంగా మారింది.
రైళ్లు, బస్సుల్లో ‘నో వేకెన్సీ’..
సంక్రాంతి రద్దీతో రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో డిమాండ్ భారీగా పెరిగింది. రేపటి వరకు దాదాపు అన్ని ప్రధాన రైళ్లు, బస్సుల్లో రిజర్వేషన్లు పూర్తిగా ఫుల్ అయ్యాయి. ఆన్‌లైన్, కౌంటర్ బుకింగ్స్ అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నప్పటికీ అవి సరిపోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సమయానికి రాని బస్సులు..
షెడ్యూల్ ప్రకారం బస్సులు రాకపోవడం ప్రయాణికుల ఆగ్రహానికి కారణమవుతోంది. పలుచోట్ల బస్టాండ్లలో గందరగోళం నెలకొనగా, కొందరు ప్రయాణికులు అధికారులను ప్రశ్నించారు. ఈ పరిస్థితితో బస్టాండ్ల వద్ద ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తోంది.
అదనపు బస్సులు ఏర్పాటు చేయాలి..
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరిన్ని అదనపు బస్సులు నడపాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పండుగ రద్దీని సమర్థంగా నియంత్రించేందుకు ఆర్టీసీ అధికారులు మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ..
ప్రభుత్వ బస్సులు, రైళ్లలో సీట్లు దొరకకపోవడంతో చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీన్నే అవకాశంగా మలచుకున్న ప్రైవేట్ బస్సు యజమానులు సాధారణ చార్జీల కంటే రెండు నుంచి మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ట్రాఫిక్‌తో నరకం..
హైదరాబాద్ నుంచి బయటకు వెళ్లే ఎగ్జిట్ పాయింట్ల వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా విజయవాడ వైపు వెళ్లే పంతంగి టోల్ ప్లాజా, వరంగల్ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ముందస్తుగా ప్రయాణ ప్రణాళిక రూపొందించుకోవాలని, ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మూడు రోజుల్లో 30 లక్షల మందికి పైగా..
అధికారిక అంచనాల ప్రకారం, గత మూడు రోజుల్లోనే హైదరాబాద్ నగరం నుంచి 30 లక్షల మందికి పైగా ప్రయాణికులు తరలివెళ్లారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.