manabharath.com
Newspaper Banner
Date of Publish : 08 January 2026, 2:08 pm Editor : Editor Vishal Kumar

త్రాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

త్రాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు!

మన భారత్, వరంగల్ జిల్లా:

రెండేళ్లుగా త్రాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళలు చివరికి రోడ్డెక్కి నిరసనకు దిగారు. ‘నీరు రావడం లేదు.. గోస పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు’ అంటూ ఖాళీ బిందెలతో రోడ్డుపై నిలబడి తమ ఆవేదన వ్యక్తం చేశారు.

వరంగల్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో రెండేళ్లుగా మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని మహిళలు ఆరోపిస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే ప్రత్యామ్నాయంగా మున్సిపల్ సిబ్బంది నీటి సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు.

నీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుండటంతో మంగళవారం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. త్రాగునీటి సమస్యను మున్సిపల్ కార్పొరేటర్లకు, అలాగే మంత్రి సురేఖకు పలుమార్లు విన్నవించుకున్నా, ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

త్రాగునీరు అందకపోవడంతో బయట నుంచి నీటిని కొనుగోలు చేసి తాగాల్సి వస్తోందని, దీంతో ఆర్థిక భారం పెరుగుతోందని మహిళలు తెలిపారు. ‘ఏండ్ల తరబడి నీరు లేకుండా ఊరిలో ఎలా జీవించాలి?’ అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తమ గ్రామానికి తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు.