manabharath.com
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 2:28 pm Editor : Editor Vishal Kumar

10 మంది కూతుళ్ల తర్వాత కొడుకు..

మన భారత్ తో మాట్లాడుతున్న వైద్యులు

పుత్రకాంక్షపై చర్చకు దారి తీసిన ఘటన

మన భారత్, హర్యానా : హర్యానా రాష్ట్రం ఉచానా ప్రాంతంలో చోటు చేసుకున్న ఓ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. 10 మంది ఆడపిల్లలు ఉన్న ఓ మహిళ, కొడుకు కావాలనే కోరికతో 11వ సారి గర్భం దాల్చి తాజాగా కుమారుడికి జన్మనిచ్చింది. తీవ్రమైన రక్తహీనత కారణంగా తల్లి ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పటికీ, కొడుకు పుట్టడంతో ఆ కుటుంబం సంబరాలు చేసుకుంది.

అయితే ఈ ఘటనతో పుత్రకాంక్షపై మరోసారి సమాజంలో విస్తృత చర్చ మొదలైంది. కొడుకు కోసం పదే పదే గర్భధారణకు వెళ్లడం మహిళ ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెట్టడమే కాకుండా, ఆడపిల్లల పట్ల వివక్షను పెంచుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది అమ్మాయిలు పుత్రకాంక్ష కారణంగానే వివక్షకు గురవుతున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇదే సమయంలో ఓ జర్నలిస్ట్ ఆ కుటుంబాన్ని కలిసి తండ్రిని కూతుళ్ల పేర్లు అడగగా, ఆనందంలో కొంతమంది పేర్లను కూడా ఆయన గుర్తు పెట్టుకోలేకపోయిన ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఆడపిల్లల విలువ, లింగ సమానత్వంపై సమాజం ఆలోచించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోందని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.